దుకాణ సముదాయానికి తాళం
● టెండర్లకు నోచుకోని వైనం
● తూప్రాన్ మున్సిపాలిటీలో అధికారుల నిర్వాకం
తూప్రాన్: మున్సిపాలిటీకి రూ. లక్షల ఆదాయం సమకూర్చే దుకాణ సముదాయం టెండర్లకు నోచుకోవడం లేదు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పక్కన ఎనిమిది దుకాణాల అగ్రిమెంట్ అయిపోయి ఏళ్లు గడుస్తుంది. టెండర్లు పిలువకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దుకాణాలు ఉన్న ప్రాంతం నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఈ దుకాణాల అద్దె సుమారు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది. కానీ అధికారులు కేవలం రూ. 6 వేల వరకు నామమాత్రంగా అద్దె వసూలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీని వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గతంలో టెండర్ల ద్వారా దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు ఇతరులకు అధికంగా అద్దెకు ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్న కాలంలోనే దుకాణాల సముదాయం ఏర్పాటు చేశారు. టెండర్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండు చొప్పున ఎనిమిది దుకాణాలను కేటాయించారు. వాటికి అప్పట్లో నామమాత్రంగా కేవలం రూ. 550 నుంచి రూ.1,200 వరకు వసూలు చేశారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత దుకాణాల సముదాయానికి రూ. 2,500 వరకు వసూలు చేశారు. తీరా అగ్రిమెంట్ పూర్తి కాగానే తిరిగి టెండర్లకు ఆహ్వానించారు. అయితే లక్ష్యానికి అనుగుణంగా టెండర్లు రాకపోవడంతో కొన్నాళ్లుగా దుకాణాల సముదాయానికి తాళం వేశారు. ప్రస్తుతం దుకాణాలు మూతపడి ఉండడంతో శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి దుకాణాలకు టెండర్లు పిలిచి దళారి వ్యవస్థ లేకుండా అర్హులైన వారికి కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు.


