జిల్లాలో చినుకులే.. భారీ వర్షం లేదు
● నిండని చెరువులు, కుంటలు, వాగులు
● ఆందోళనలో అన్నదాతలు
● బోరుబావుల కింద కొనసాగుతున్న
వరినాట్లు
తూప్రాన్: వాతావరణ శాఖ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ప్రకటనలు చేస్తున్నా.. వరుణ దేవుడు మాత్రం కరుణించడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు చినుకులే తప్ప.. భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. జలకల లేక చెరువులు వెలవెలబోతున్నాయి. వాటి కింద ఆయకట్టు బీడుగా మారింది. బోర్లలో నీరున్న రైతులు ముందస్తుగా తుకాలు పోసుకున్నారు. గొలుసుకట్టు చెరువులపై ఆధారపడి సాగు చేస్తున్న వారు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 2,327 చెరువులు
జిల్లాలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతు లు నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. కానీ చెరు వు లు, కుంటలు నిండకపోవడంతో సాగుకు సరిపడా నీరు లేక అయోమయంలో పడ్డారు. వాన లు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండితేనే వరి నాట్లు వేసే పరిస్థితి నెలకొంది. గతేడాది జూలైలో జిల్లాలోని చెరువుల్లో జలకళ కనిపించగా, ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో ఒక్క చెరువు కూడా నిండిన దాఖలాలు లేవు. మెట్ట పంటల సాగుకు మాత్రం వాతావరణ పరిస్థితులు కొంత మేర అనుకూలంగా ఉండగా.. వరి పండించే రైతులకు వరుణదేవుడు నిరాశే మిగిల్చాడు. జిల్లాలో వరి సాగు అంచనా 3 లక్షల ఎకరాలు వరకు ఉండగా, ప్రస్తుతం ఇప్పటివరకు సుమారు 74 వేల ఎకరాల్లో మాత్రమే సాగు అయినట్లు జిల్లా వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఈసమయంలో 249.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది 185.9 ఎంఎంగా నమోదైంది. జిల్లాలో 2,327 చెరువులు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చెరువుల్లోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. కేవలం బోరుబావుల వద్దే రైతులు వరి సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా బోరుబావులు, హల్దీవాగు పరివాహ ప్రాంత రైతులు వరి నాట్లు వేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఆగస్టులోనైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తే తమ పంటలు పండుతాయన్న ఆశతో రైతులు ఉన్నారు.
జిల్లాలో పంటల సాగు వివరాలు
వరి 74 వేలు (సమారు)
జొన్నలు 33
కంది 590
మొక్కజొన్న 1,371
పత్తి 33,800
పెసర్లు 619
మినుములు 853
స్వీట్‌కాన్ 193
పామాయిల్ 900
కూరగాయలు 628
(ఎకరాల్లో)
రైతులు ఆందోళన చెందొద్దు
ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న వారు ఆగస్టులో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంట సాగు చేసుకోవచ్చు. ఆపై వర్షాలు పడితే ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే బోరుబావుల వద్ద వరి నాట్లు వేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. కనుక వరి రైతులు ఆందోళన చెందొద్దు. – దేవకుమార్, జిల్లా వ్యవసాయాధికారి
బీడుగా ఆయకట్టు