
పక్కదారి!
సబ్సిడీ యూరియా
కొన్ని పరిశ్రమల్లో గుట్టుగా సాగుతున్న అక్రమ వినియోగం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ అవసరాలకు వినియోగించే సబ్సిడీ యూరియా పక్కదారి పడుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్ గ్రేడ్ (కమర్షల్) యూరియా వాడాలి. కానీ దాని స్థానంలో తక్కువ ధరకు సబ్సిడీపై లభిస్తున్న వ్యవసాయ యూరియాను అక్రమంగా ముడిసరుకుగా వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బొల్లారం, పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమల్లో ఇలా వ్యవసాయ యూరియాను ముడిసరుకుగా వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ అక్రమ వాడకం కొనసాగుతుండగా.. ప్రస్తుతం యూరియా కొరత నేపథ్యంలో ఈ వ్యవహరం తెరపైకి వస్తోంది.
రైతుల ఇబ్బందులు
యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు బస్తాల కోసం రోజంతా క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చెప్పులు, పాస్‌పుస్తకాలను లైన్‌లో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు వినియోగించాల్సిన యూరి యా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
వ్యవసాయేతర అవసరాలకు ఇలా..
యూరియాను ఒక్క వ్యవసాయ అవసరాలతో పాటు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగిస్తారు. ఇందులో 46 శాతం నైట్రోజన్ ఉంటుంది. చిన్న చిన్న మిశ్రమాలు కలిపితే వివిధ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరుకుగా మారుతుంది. ప్రధానంగా రసాయన పరిశ్రమలు, లూబ్రికేంట్స్, ప్లాస్టిక్, రెసిన్స్, అతుక్కునే పదార్థాలు, క్రీములు, లోషన్లు, రబ్బరు వంటి పరిశ్రమలకు యూరియాను ఓ ముడిసరుకుగా వాడుతుంటారు. పెయింట్, రబ్బరు, టాయిలెట్ క్లీనర్లు, శుభ్రపరిచే యంత్రాలు వంటి వాటి తయారీకి కూడా ఈ యూరియా వినియోగం ఉంటుంది.
టెక్నికల్ గ్రేడ్ యూరియాకు ఎక్కువ రేటు..
రైతులకు సరఫరా చేస్తున్న యూరియా ఎరువులపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీలు భరిస్తుంది. 50 కిలోల బస్తాకు రైతుకు రూ. 266 చొప్పున విక్రయిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు వినియోగించే యూరియాను టెక్నికల్ గ్రేడ్ యూరియా అని పిలుస్తారు. దీని ధర బస్తాకు రూ. 1,500 నుంచి రూ. రెండు వేల వరకు ఉంటుంది. వ్యవసాయానికి వాడాల్సిన యూరియా తక్కువ ధరకు లభిస్తుండటంతో కొన్ని పరిశ్రమలు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
టెక్నికల్ గ్రేడ్ స్థానంలో
వ్యవసాయ యూరియా వాడకం?
కొరత నేపథ్యంలో
తెరపైకి వస్తున్న దందా..
అధికారుల కనుసన్నల్లోనే..?
అధికారులు, డీలర్ల కనుసన్నల్లోనే ఈ వ్యవహా రం నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాకు ఎరువులు సరఫరా చేసే రైల్వే రేక్‌పాయింట్ల నుంచే నేరుగా ఈ పరిశ్రమలకు లారీల్లో యూ రియాను డంప్ చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ పలుకుడి ఉన్న ఓ స్థానిక నాయకుడు ఈ దందాను వెనుకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కొందరు డీ లర్ల గోదాములకు డెలివరీ చేస్తున్నట్లు, వే బిల్లులతో వారానికి రెండు, మూడు లారీలు ఈ పరిశ్రమల్లో యూరియా అక్రమంగా డంప్ అవుతున్నట్లు తెలుస్తోంది.
దొరికితేనే దొంగలు..
జిల్లాలో పలు పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకున్న అనుమతులు ఒకటి ఉంటే.. అందులో తయారయ్యే ఉత్పత్తులు మరొకటి ఉంటున్నాయి. ఇలా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో నకిలీ పాలను తయారు చేస్తున్న వ్యవహరం గతంలో పోలీసుల దాడుల్లో తేటతెల్లమైంది. ఈ పాల తయారీకి కూడా యూరియాను వాడుతున్నట్లు గుర్తించారు. అనుమతి ఒక ఉత్పత్తికి తీసుకొని.. మరో ఉత్పత్తులను తయారు చేస్తున్న కొన్ని పరిశ్రమలు.. ఇలా ముడి పదార్థాల తయారీకి సబ్సిడీ ముడి సరుకులను వాడటానికి ఏమాత్రం వెనుకాడరనే ఆరోపణలు ఉన్నాయి.