
మహిళా సాధికారతకు పెద్దపీట
సంగారెడ్డి: స్వయం సహాయక సంఘం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం పుల్కల్ మండలం సింగూరు చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన అందోల్ నియోజకవర్గ మహిళా శక్తి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందన్నారు. రాష్ట్రంలోనే మొదటి మహిళా శక్తి పెట్రోల్ బంక్‌లు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజూ 5 నుంచి 6 లక్షల టర్నోవర్ సాధించడంతో పాటు 16 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పెట్రోల్ బంక్ ద్వారా ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు. అలాగే మహిళా క్యాబ్ డ్రైవర్లుగా 50 మంది మహిళలకు శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు. వీరందరికీ త్వరలో రాయితీపై కార్లు ఇప్పించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు వ్యవసాయ రంగంలో పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్ వినియోగంపై మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని 9 మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీ రుణాల చెక్కులను అందజేశారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల మాట్లాడుతూ.. మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అలాగే అర్హులకు కొత్త రేషన్‌కార్డులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, ఆర్‌డీఓ పాండు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ