
పకడ్బందీగా సంక్షేమ పథకాలు
కలెక్టర్ రాహుల్‌రాజ్
రేగోడ్(మెదక్): మారుమూల గ్రామాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిందోల్, టి.లింగంపల్లి, తాటిపల్లి గ్రామాల్లో మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాలు, పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఇతర సంక్షేమ పథకాల మంజూరు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలలను తనిఖీ చేసి పాఠశాలల్లోని సమస్యలు, ఉపాధ్యాయుల పనితీరును అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా ప్రభుత్వం నగదును జమ చేస్తుందన్నారు.
పరిశుభ్రత పాటించాలి
ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రాకుండా ఉంటాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి కాలానుగుణ జ్వరాలకు దారితీసే డ్రెయిన్ వాటర్ నిల్వ వంటి సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. దీని నివారించడానికి ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమల లార్వాలను నివారించడానికి అన్ని పాత గోళాలు ఖాళీ చేయడం ముఖ్యమని చెప్పారు. ఏవైనా జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు వస్తే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు చేయించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, భవన నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ తన చాంబర్‌లో విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్, విద్యా శాఖ విభాగాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. సమావేశంలో డీఈఓ రాధాకిషన్, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, విద్యా సంక్షేమ మౌలిక వసతుల సంస్థ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ నరసింహచారి, జేఈలు తదితరులు పాల్గొన్నారు.