
సిగాచీ పరిశ్రమకు ఎన్‌డీఎంఏ
ప్రమాద స్థలం అధ్యయనం
పటాన్‌చెరు: ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా పరిశ్రమను మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్‌డీఎంఏ) బృందం సందర్శించింది. ఈ బృందం సభ్యులు ప్రమాద స్థలాన్ని నిశితంగా పరిశీలించి అణువణువూ గాలించారు. ప్రమాద వివరాలను ఆ సమయంలో కొనసాగుతున్న ఉత్పత్తి తదితర అంశాలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌డీఎంఏ కేంద్ర బృందం కమిటీ సభ్యులు, సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధ్యయనంతో పాటు పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో ఏ పరిశ్రమల లోనూ పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వ నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, పరిశ్రమలశాఖ, అగ్ని మాపకశాఖ, కార్మికశాఖ, పో లీసు, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.