గీత దాటితే వేటు తప్పదు
డీఈఓ రాధాకిషన్
హవేళిఘణాపూర్(మెదక్)/కౌడిపల్లి(నర్సాపూర్): ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ రాధాకిషన్ హెచ్చరించారు. శుక్రవారం మండల వనరుల కేంద్రంలో వారితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. పాఠ్య పుస్తకాలు అమ్మాలంటే విధిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాలలో టచ్‌ఫర్ చేంజ్ ట్రస్ట్, పెగా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 12 లక్షలతో వాటర్ ప్లాంట్, బాల బాలికల కోసం వేర్వేరుగా నిర్మించిన టాయిలెట్స్‌తో పాటు బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్‌బీఐ కార్పొరేట్ రెస్పాన్స్ స్కీం ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్స్‌ను ప్రారంభించారు.


