బల్దియాల్లో మాన్‌సూన్
కొనసాగుతున్న100 రోజుల యాక్షన్‌ప్లాన్
● సెప్టెంబర్ 10 వరకు కొనసాగింపు ● జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు,75 వార్డులు
వానాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీల్లో మాన్‌సూన్ పేరిట 100 రోజుల ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈనెల 2వ తేదీన యాక్షన్‌ప్లాన్ ప్రారంభం కాగా, సెప్టెంబరు 10వ తేదీ వరకు కొనసాగనుంది. ముందస్తుగా పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తపై వార్డుల వారీగా అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
– మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 75 వార్డులు ఉండగా, రెండు లక్షల పైచిలుకు జనాభా ఉన్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా దోమల నివారణతో పాటు కలుషిత తాగునీటితో వచ్చే వ్యాధులపై అధికారులు రోజుకో వార్డులో పర్యటిస్తూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 62 రకాల అంశాలను 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వార్డుల్లో మురికి కాలువల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, తడి, పొడి చెత్తపై ప్రచారం, గుంతల్లో నీటి నిల్వ లేకుండా చూడటం, దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. మలేరియా, డెంగీ వ్యాధులు సోకకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీధుల్లో రోడ్ల శుభ్రత, ఇళ్లలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూడటం, పరిసరాల పరిశుభ్రతపై ముందుస్తుగా వివరిస్తున్నారు.
62 అంశాలపై కార్యాచరణ
మున్సిపాలిటీల్లో 62 అంశాలపై వంద రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించి, ఆ దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఆయా బల్దియాల పరిధిలో పెంచుతున్న నర్సరీల్లో మొక్కల వివరాలు సేకరించి వార్డుల్లో, చెరువు కట్టలు, రోడ్లకు ఇరువైపులా నాటడం, ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించడం, అత్యవసరమైన పనులకు వెంటనే టెండర్లు పిలిచి నిర్దేశించిన పనులను తగిన సమయంలో చేయించడం, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం వార్డు అధికారులు ఇంటితో పాటు వివిధ రకాల పన్నులను ఎప్పటికప్పుడు వసూలు చేయటం, కొత్తగా వ్యాపారులకు లైసెన్స్‌లు అందించడం, వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించటం, వికలాంగుల కోసం ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించటం, అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించి అవసరమైన వారికి కనెక్షన్ ఇవ్వటం లాంటి పనులు చేపట్టనున్నారు.
పక్కాగా అమలుచేస్తాం
ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తాం. ఇప్పటికే వార్డుల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. ముందుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను, మహిళా సంఘాల సభ్యులతో పాటు ఎన్‌జీఓలను సైతం భాగస్వాములను చేస్తున్నాం.
– శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్


