
సర్వేయర్ల శిక్షణ ప్రారంభం
మెదక్ కలెక్టరేట్: భూ లావాదేవీల్లో పారదర్శకత కోసమే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ పరిధిలో గల ఆర్ట్స్ క్యాంపస్‌లో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా నుంచి మొదటి విడతలో మొత్తం 116 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి రెండు నెలల శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రభుత్వం తరఫున విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. భూ భారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పట్టాదారుని భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్‌లు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని, శిక్షకులు అన్ని అంశాలను బోధించాలని సూచించారు. నూతన సర్వేయర్ల నియామకంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈసందర్భంగా సర్వేయర్లకు శిక్షణ సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో భూ కొలతల సహాయ సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.