
ఇసుకాసురుల తిరకాసు దందా!
పాపన్నపేట(మెదక్): ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందని అప్పట్లో ఓ ప్రైవేట్ సంస్థ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. అలాంటి ఐడియా అక్రమార్కులకు వస్తే.. జేబులు నిండా కాసులే. ఇసుక అక్రమ రవాణాపై నిషేధం ఉండడంతో ఇదిగో అక్రమార్కులకు ఒక కొత్త ఆలోచన తట్టింది. అదేమిటంటే.. మంజీర నదిలో ఇసుక రవాణాపై నిషేధం ఉంది. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట, రేగోడ్ మండలం సింధోల్ పరిసర ప్రాంతాల్లో గాడిదలను ఎక్కువగా పెంచుతుంటారు. యూసుఫ్‌పేటకు ఎనిమిది కుటుంబాలు వలస వచ్చాయి. మొత్తం 40 మంది ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 55 గాడిదలు ఉన్నాయి.. ఒక్కో కుటుంబం రోజుకు మూడు ట్రిప్పుల ఇసుక రవాణా చేస్తాయి. అంటే 24 ట్రాక్టర్లు అన్నమాట. నది నుంచి ఒడ్డుకు ఇసుక రవాణా చేస్తే (55 గాడిదలకు కలసి) ఒక్కో ట్రిప్‌కు రూ.1400 ఇస్తారు. గ్రామంలోనికి రవాణా చేస్తే 55 గాడిదలకు రూ.3,500 చెల్లిస్తారు. ఒక వేళ ట్రాక్టర్ యజమానులు నది ఒడ్డు నుంచి గ్రామం లోనికి రవాణా చేస్తే, గాడిదల యజమానులకు రూ.1900 ఇస్తారు. రూ.900 ట్రాక్టర్ కిరాయి రూ.300 మామూళ్లు తీసుకుంటారు. పాపన్నపేట మండలం చుట్టూర మంజీర నది ఉండటంతో ఏటా ఇక్కడి వ్యాపారులు వారికి అడ్వాన్సుగా డబ్బులిచ్చి గాడిదలను పిలుపించుకుంటారు. లారీలు, ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో వీటిపై ఇసుక రవాణా చేస్తున్నారు. 55 గాడిదలు సుమారు ట్రాక్టర్ ఇసుకను రవాణా చేయగలవు. ఒక వేళ నది నుంచి ఇసుక తీసి ఒడ్డున పోస్తే రూ.1,950, ఇంటి వరకు ఇసుక రవాణ చేస్తే రూ.3,500 తీసుకుంటున్నారు. గతంలో కొడుపాక, గాజులగూడెంలలో కూడా గాడిదలపై ఇసుక రవాణా కొనసాగించేవారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని మండలవాసులు కోరుతున్నారు.
మంజీర నదిలో ఇసుక రవాణాపై నిషేధం
అక్రమార్కుల కొత్త ఎత్తుగడ
గాడిదలపై ఇసుక రవాణా
55 గాడిదల ఇసుకకు రూ.3,500