
మహిళలకు ఉపాధి
టంకర్ల తయారీ..
నిజాంపేట(మెదక్): సీజనల్ పనులతో సంచార జీవులు ఉపాధి పొందుతున్నారు. ఉత్పత్తులను పొరుగు జిల్లాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నిజాంపేట మండలం కల్వకుంటలో మామిడి టంకర్లతో ఉపాధి పొందేవారు వందల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా సంచార జీవులతో పాటు ఇతర సామాజిక వర్గం వారు టంకర్ల ఎగుమతి చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన కొందరు వ్యాపారులు పరిసర గ్రామాల నుంచి మామిడి కాయలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చెట్లకు పూత దశల్లో ఉన్నప్పుడు మండలంతో పాటు చుట్టూ పక్కల ఉన్న మండలంలోని మామిడి తోటలు తిరిగి చెట్లకు కాసిన కాయలను అంచనా వేసి కొనుగోలు చేస్తుంటారు. మే మాసంలో చెట్లకు కాసిన కాయలు తీసి గ్రామానికి తీసుకొస్తుంటారు. దాదాపుగా 20 నుంచి 30 మంది ఇలా వ్యాపారం చేస్తుంటారు. ఇలా ఒక్కో వ్యాపారి వద్ద 10 నుంచి 20 మంది వరకు వ్యాపారులు మామిడి టంకర్ల (వరుగు) తయారీ చేస్తుంటారు. దీన్ని ఔషధాలు, తినుబండారాలతో పాటు ఇతర పదార్థాలలో వాడుతారు.
చెట్ల కింద టంకర్ల తయారీ
చెట్ల నీడలో మామిడికాయలు పొట్లు తీసి, ముక్కలు కోసి ఎండలో ఎండబెడ్తారు. ఈ టంకర్ల తయారీలో చాలా మంది మహిళ కూలీలు ఉపాధి పొందుతున్నారు. రెండు నెలల పాటు పని దొరుకుతుందని కూలీలు చెబుతున్నారు. తయారైన టంకర్లను పొరుగున్న ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్‌కు తరలిస్తారు. కూలీలకు వంద కాయలు తరిగితే రూ.50 ఇస్తున్నారు. ఒక్కో మహిళా కూలీ ఒక రోజుకు 1,000 మామిడి కాయలు తరిగితే రూ. 500 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. క్వింటాలు ధర రూ రూ.23 వేల వరకు పెరిగితే తప్ప తమ కష్టానికి తగిన ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మామిడి తోటల రైతులకు మార్కెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైతులు మామిడి టంకర్ల వ్యాపారం చేసి వ్యాపారం చేసే వారికి కాయలు అమ్ముకుంటున్నారు.
వెయ్యి మామిడి కాయలు తరిగితే రూ.500
స్థానికులకు రెండు నెలలు ఉపాధి
అకాల వర్షాలతో తీరని నష్టం