
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని మోడల్ కాలేజీలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ వాణికుమారి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలలో 40 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయన్నారు. ఈనెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని హార్డ్ కాపీని కాలేజీలో అందించాలని సూచించారు. బాలికల కోసం హాస్టల్ సౌకర్యం ఉందని వివరించారు.
శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
శివ్వంపేట(నర్సాపూర్): శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్ వెన్నెల, హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు సిద్దేశ్వర పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న అన్నారు. మండల పరిధి పిల్లుట్లలో హిందూ బీసీ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి బండారి గంగాధర్ ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని సోమవారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
ఫార్మర్ ఐడీకి ఇబ్బందులు
కౌడిపల్లి(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల నమోదు (ఫార్మర్ ఐడీ కార్డులు) మొదట్లోనే ఇబ్బందులు ఏర్పడ్డాయి. సోమవారం కౌడిపల్లి పంచాయతీ వద్ద వ్యవసాయ అధికారులు అగ్రియాప్‌లో రైతుల వివరాలు నమోదు చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే యాప్‌లో సర్వే నంబర్లు నమోదు చేసినా భూముల వివరాలు రాలేదు. దీంతో రైతులకు ఫార్మర్ ఐడీ రిజిస్టర్ కాలేదు. ఈ సమస్యను ఏఈఓలు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేశారు. అగ్రియాప్‌లో భూభారతి వివరాలు నమోదు కాలేదని, దీంతో సమస్యగా మారిందని తెలిపారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
కార్మికుల సమస్యలపై
పోరాటం: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్: కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం తెలిపారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 3, 4 తేదీల్లో రెండు రోజులపాటు రామాయంపేటలో నిర్వహించిన జిల్లా మహాసభలు జయప్రదంగా ముగిశాయని అన్నారు. జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న 17 రకాల సమస్యలపై ఈ మహాసభలో తీర్మానం చేశామన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదని వాపోయారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బాలమణి, సహాయ కార్యదర్శి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
పైరవీలకు తావు లేదు: ఏఎస్పీ మహేందర్
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పైరవీలకు తావు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.

‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు