
నిండుకున్న సన్న బియ్యం
● రేషన్ డీలర్ల ఎదురుచూపులు ● ఈనెల రావాల్సింది 3,500 మెట్రిక్ టన్నులు ● వచ్చింది 2 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే
పాపన్నపేట(మెదక్): సన్న బియ్యం పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మండల స్థాయి స్టాక్ పాయింట్లలో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో రేషన్ డీలర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్ల చుట్టూ తిరుగుతున్నారు. లబ్ధిదారులు సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈనెల 3,500 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం ఉండగా, ఇప్పటివరకు 2 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. జిల్లాలో మొత్తం 520 రేషన్ షాపులకు గాను, 270 షాపులకు బియ్యం చేరాయి. అలాట్‌మెంట్ ఆలస్యం కావడంతో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది.
మొత్తం 520 రేషన్ షాపులు
జిల్లాలో 2,14,278 రేషన్ కార్డులు ఉండగా, 7,11,976 లబ్ధిదారులున్నారు. ప్రతి నెలా 4,522 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. గత నెల నిల్వలు పోను ఈనెల 3,500 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమున్నాయి. జిల్లాలో 520 రేషన్ షాపులు ఉండగా, ఇప్పటివరకు 270 షాపులకు సన్న బియ్యం అందినట్లు తెలుస్తోంది. మిగితా రేషన్ షాపుల డీలర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్ల చుట్టూ తిరుగుతున్నారు. పాపన్నపేట, టేక్మాల్ మండలాలకు కలిసి పాపన్నపేట ఎంఎల్‌ఎల్ పాయింట్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు. రెండు మండలాల్లో కలిపి 74 రేషన్ షాపులు ఉండగా, 4,446.84 క్వింటాళ్ల సన్న బియ్యం రావాలి. అయితే ఇప్పటివరకు 3,041 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 1,405 క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉంది. 74 రేషన్ షాపుల్లో, 48 షాపులకు బియ్యం సరఫరా చేశారు. మిగితా 26 షాపులకు రేషన్ రావాల్సి ఉంది. ఆదివారం నాటికి ఎంఎల్‌ఎస్ పాయింట్లో సన్న బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో డీలర్లు తిరిగిపోతున్నారు. ప్రతి నెలా మొదటి తేదీన బియ్యం తీసుకునే వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాట్‌మెంట్ ఆలస్యం
ప్రతి నెలా 20వ తేదీ వరకు కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాలకు రేషన్ బియ్యం అలాట్‌మెంట్ జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి 10లోగా లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ జరిగేది. కానీ ఈసారి ఏప్రిల్ 27న అలాట్‌మెంట్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, కార్డుల్లో పేర్ల చేర్పులు, తొలగింపులు తదితర కారణాల వల్ల అలాట్‌మెంట్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.