
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
గాలివాన బీభత్సం
నేటి నుంచి శ్రీకారం
● జూన్ 13 వరకు కార్యక్రమం ● మెరుగైన సాగు పద్ధతులపై అన్నదాతలకు అవగాహన
మెదక్‌జోన్: వానాకాలం సాగు కు రైతులను సమా యత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి జూన్ 13వ తేదీ వరకు ‘రైతు ముంగిట్లో’ శాస్త్రవేత్తలు పేరిట కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. పంటలపై తెగుళ్ల దాడిని ముందే అరికట్టి దిగుబడి పెంచి అన్నదాతకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది.
ఒక్కోటీం 10 గ్రామాలు
జిల్లావ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు వ్యవసాయ భూములు ఉండగా, 3.95 లక్షల ఎకరాల్లో ఏటా వివిధ రకాలు పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో సింహాభాగం రైతులు వరి సాగు చేస్తున్నారు. నారు పోసిన నాటి నుంచి వరికోతకు వచ్చే వరకు పలురకాల తెగుళ్లు పంటలపై దాడి చేస్తున్నాయి. వాటి నివారణకు రైతులు లెక్కకు మించి పురుగు మందులు వాడుతున్నారు. దీంతో భూములు విషతుల్యం అవుతున్నాయని భావించిన రాష్ట్ర ఉన్నతాధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలను ముందుగానే పల్లెలకు పంపి అన్నదాతలకు పంటల సాగుబడిపై తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించారు. పంటలు సాగు ప్రారంభం కాకముందే రైతులకు అవగాహన కల్పించేందుకు 40 రోజుల పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఇందులో 10 మంది శాస్త్రవేత్తలతో పాటు మరో 30 నుంచి 40 మంది ఇతర వ్యవసాయ అధికారులు ఉంటారు. ఒక్కోటీం 10 గ్రామాల చొప్పున మొత్తం 60 గ్రామాల్లో పర్యటించనున్నారు. యూరియా వాడకాన్ని తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వినియోగించడం, విత్తనాలు కొన్నప్పుడు రసీదులు భద్రపరచుకోవడం, పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిసారించడం లాంటి తదితర అంశాలపై రైతులను చైతన్యవంతులను చేయనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతుల వద్దకు శాస్త్రవేత్తలు రావటం ఇదే మొదటిసారి. ఈ అవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి. వారు చెప్పే విషయాలను అనుసరించి పంటలు సాగు చేపట్టాలి.
– వినయ్‌కుమార్, ఇన్‌చార్జి డీఏఓ
మొదటి విడతలో 8 మండలాలు
కాగా నేటి నుంచి జూన్ 13వ తేదీ వరకు 40 రోజుల పాటు రామాయంపేట, హవేళిఘణాపూర్, టేక్మాల్, నార్సింగి, మనోహరాబాద్, నర్సాపూర్, తూప్రాన్, చిన్నశంకరంపేట మండలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. పొలంలో మట్టి పరీక్షలు నిర్వహించి ఏరకమైన పంటకు నేల అనుకూలం, ఏ మేరకు దిగుబడి వస్తుంది. ఆ భూమిలో వాడాల్సిన రసాయన ఎరువుల మోతాదు, దుక్కి మందు, ఇతర సలహాలు ఇవ్వనున్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడితే ఎలాంటి తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. భూసారం ఏ విధంగా దెబ్బతింటుంది. అదే జరిగితే భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందనే వివరాలను వెల్లడించనున్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు