పారదర్శక నమోదుతోనే పార్టీ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

పారదర్శక నమోదుతోనే పార్టీ నిర్మాణం

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

● బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి నారదాసు లక్ష్మణ్‌

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): పారదర్శకంగా చేపట్టే సభ్యత్వ నమోదుతోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి నారదాసు లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలో గల ఎస్‌వీఎస్‌ గార్డెన్స్‌లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అధ్యక్షతన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌), పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో బూత్‌ స్థాయి కార్యకర్తలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ రూ.50తో పార్టీ క్రీయాశీలక సభ్యత్వం, రూ.10తో సాధారణ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టాలన్నారు. కేసీఆర్‌ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్‌చార్జి కౌశిక హరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ రూ.13.50 కోట్లు మంజూరైన రంగపేట బ్రిడ్జ్‌ పనులు ప్రారంభించకుండా ఆరు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టడం అనాలోచిత నిర్ణయమన్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

బెల్లంపల్లి: పార్టీ సభ్యత్వ నమోదును ప్రతీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమ పార్టీగా అవతరించి రాజకీయ పార్టీగా ఎదిగిన బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం దోహద పడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ టి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement