మంచిర్యాలక్రైం: వాహనదారులు త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే ప్రయత్నంలో రహదారి నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ నియంత్రణ కోల్పోతున్నారు. ప్రమాదాలను పసిగట్టలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జాతీయ రహదారులపై వేగ పరిమితి గంటకు 80కిలో మీటర్లు ఉండగా చాలామంది 100–130 వేగంతో వాహనాలు నడుపుతున్నారు. జిల్లాలో గతేడాది 429 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో 136 మంది మృతి చెందగా, 435 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీస్ చేపట్టిన ‘అరైవ్–అలైవ్’ మూడో విడత కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు, డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించండి.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండంటూ.. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఎదురుగా వచ్చేవారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఉంది.
అతి వేగం.. మద్యం మత్తు
అతి వేగం, మద్యం మత్తులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని అంచనా వేయలేక పోతున్నారు. ముందున్న వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించే క్రమంలో సడెన్‌గా బ్రేకులు వేస్తుండడంతో అదుపు తప్పి వాహనాలు బోల్తా పడుతున్నాయి. వేగంపై అంచ
నా లేకపోవడంతో వాహనదారులు ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొడుతున్నారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవర్లు నియంత్రణ కోల్పోతుండడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపకూడదన్న నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
రోడ్డు ప్రమాదాలకు కారణాలివే..
ఇటీవల జరిగిన ప్రమాదాలు
ఇటీవల రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్ క్షేత్రస్థాయిలో ప్రమాదాలు జరిగిన స్థలాలను పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల డ్రైవర్లు, ఓనర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలు, కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.


