‘ఓసీలకు అన్యాయం జరిగితే సహించం’
ఆదిలాబాద్: 75 ఏళ్లుగా కొనసాగుతున్న రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల ఓసీ సామాజిక వర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. రిజర్వేషన్ల పేరుతో రాజకీయ నాయకులు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ, అగ్రవర్ణ పేదలను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఓసీలు 20 శాతం కూడా ఎన్నిక కాకపోవడం వారి దయనీయ స్థితికి నిదర్శనమన్నారు. భవిష్యత్‌లో తమకు పోటీ వస్తారనే భయంతో ఓసీ నాయకులే తమ వర్గానికి చెందిన వారిని ఎదగనీయడంలేదని ఆరోపించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓసీలను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని, ఇకపై అన్యాయాన్ని సహించబోమన్నారు.


