బల్దియాలో మళ్లీ విస్తరణ పనులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో రోడ్డు విస్తరణ పనులు మళ్లీ చేపట్టారు. శనివారం పాతబస్టాండ్ చౌరస్తా వద్ద నుంచి అంబేడ్కర్ నగర్ చౌరస్తాకు వెళ్లే మార్గంలో అడ్డుగా ఉన్న కట్టడాలను బేసీబీలతో తొలగించారు. రోడ్లకు ఇరువైపుల ఉన్న ఇళ్లు, దుకాణాల యజమానులకు నోటీసులు అందజేసినా స్పందించకపోవడంతో బందోబస్తు మధ్య గదులు, ప్రహరీ పడగొట్టించారు. కొందరు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఆటోస్టాండ్‌ను తొలగించి స్థలాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని ఆటోడ్రైవర్లు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన రామ్‌కుమార్‌కు పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆటోస్టాండ్ స్థలంలోనే గ్రామీణ ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం రూ.10లక్షల అంచనాతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. బందోబస్తులో బెల్లంపల్లి వన్‌టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు కే.శ్రీనివాసరావు, సిహెచ్.హనోక్, ఎన్.దేవయ్య, బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై సిహెచ్.కిరణ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


