బుగ్గగూడం శివారులో పులి సంచారం
కాసిపేట: మండలంలోని బుగ్గగూడం, బెల్లంపల్లి మండల శివారు అటవీ ప్రాంతాల మధ్య పులి సంచరిస్తోంది. శనివారం ఉదయం అటువైపుగా వెళ్లిన కొందరు వ్యక్తులు పులి పాదముద్రలు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్‌నాయక్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు అడవిలో పర్యటించారు. పులి సంచరిస్తోందని పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. సమీప గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. రేంజ్ అధికారి పూర్ణచందర్ మాట్లాడుతూ పులి ఉందని అటవీ శాఖ అధికారులు చెప్పే వరకు పుకార్లు నమ్మవద్దని బుగ్గగూడ, లంబాడితండా(డీ), కర్షలగట్టం గ్రామాల్లో డప్పు చాటింపు వేయించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి మేకల కాపరులు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, రైతులు, కూలీలు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. పులి తిర్యాణి మండలం వైపు వెళ్లినప్పటికీ గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో కదలికలు ఉన్నాయని తెలిపారు.


