● ఎదురుచూస్తున్న రైతులు ● భారీ వర్షాలతో సాగుకు ముందడుగు
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ముగిసి యాసంగి సీజన్ మొదలైంది. రైతాంగం వరికొయ్యలు తొలగించి దుక్కులు దున్ని నారుమడులు సిద్ధం చేసుకుని వరినారు పోసుకుంటోంది. నాట్లు వేసుకునేందుకునే సిద్ధమవుతోంది. ప్రభుత్వం అందించే రైతుభరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తోంది. విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయి, కూలీల ఖర్చు ఇతరత్రా వ్యవసాయ పరికరాల అవసరాలకు పెట్టుబడి కోసం ఆసరా అవుతుందని రైతులు భావిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరింది. రికార్డు స్థాయిలో వర్షాలతో భూగర్భ జలమట్టం పెరిగింది. పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు యాసంగి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో కంటే వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలం పంటలు దిగుబడి వచ్చి ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు కొందరు సిద్ధమవుతున్నారు. రైతుభరోసా సాయం చేతికందితే సాగు పనులు ముమ్మరం కానున్నాయి.
సాగును ప్రోత్సహించేందుకు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. మొదట ఎకరానికి రూ.4వేల చొప్పున అందించింది. ఆ తర్వాత రూ.5వేలకు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుభరోసా పథకం పేరు మార్చి ఎకరానికి రూ.7,500 అందిస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, రియల్‌ఎస్టేట్ వెంచర్లు, ప్రాజెక్టు ముంపు భూములకు రైతుబంధు అందించి అక్రమాలకు పాల్పడిందని విచారణ చేపట్టి నిలిపి వేసింది. గత వానాకాలం నుంచి రైతు భరోసా పథకం కింద రూ.6వేల చొప్పున అందిస్తోంది. 1,52,162 మంది రైతుల ఖాతాల్లో రూ.198.12కోట్ల నగదు జమ చేసింది. ప్రస్తుతం యాసంగి మొదలైంది.
గత వానాకాలంలో అందిన రైతులు
అర్హులైన రైతులు 1,52,162 మంది
అందిన నగదు రూ. 198.12 కోట్లు
● ఎదురుచూస్తున్న రైతులు ● భారీ వర్షాలతో సాగుకు ముందడుగు


