 
															సురక్షితంగా ప్రయాణించేలా..!
డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు ఆర్టీసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండేలా సూచనలు బస్సు ప్రమాదాల నేపథ్యంలో చర్యలు
ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బైకర్ నిర్లక్ష్యం, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, డ్రైవర్, కండక్టర్ల నిర్లిప్తత వెరసి 19 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో సైతం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే తీసుకోవాల్సిన భద్రత ప్రమాణాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
ముందే చెకింగ్..
ఆర్టీసీ బస్సులు బయలు దేరేముందే అన్ని విధాలుగా మెకానిక్‌లు చెక్ చేయనున్నారు. బస్సు డిపోకు చేరుకున్న తర్వాత సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసి, డ్యామేజీలు, టైర్ల పనితీరు వంటివి క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనంతరం ట్యాంకులో డీజిల్ నింపి, వాషింగ్, స్వీపింగ్ వంటివి చేసి బస్సులను మెకానిక్ వద్దకు పంపుతారు. మెకానిక్‌లు లీకేజీలు, ఇంజన్ ఆయిల్ చెకింగ్, కూలెంట్ పనితీరు, బోల్ట్‌లు చెక్ చేయడం వంటివి చేసి ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తారు. ఎలక్ట్రీషియన్ వైరింగ్ చెక్ చేయడంతో పాటు హెడ్‌లైట్స్, ఇండికేటర్స్ వంటివి సరి గ్గా పని చేస్తున్నాయో లేదో పరిశీలిస్తారు. ప్రతీ నెల రోజులకు ఒకసారి హబ్ సర్వీసింగ్ చేయడం, ప్రతీ మూడు నెలలకు గేర్ బాక్స్ మార్పిడి వంటివి చేపడుతారు. అయితే ఇకనుంచి ఒకటికి రెండుసార్లు బస్సును పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే నడిపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులకు సూచనలు..
ఆర్టీసీ బస్సుల్లో బస్సులు బయలు దేరేముందు ప్రయాణికులకు డ్రైవర్లు పలు సూచనలు చేయనున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు ఏ రకంగా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయంపై సూచించనున్నారు. ముందుగా తమను తాము పరిచయం చేసుకొని, బస్సు వివరాలు, ఎన్ని గంటలకు గమ్యం చేరుకుంటుందనే విషయాన్ని తెలియపరుస్తారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడడం ఎలాగో వివరిస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక పరికరాల వాడకం, అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు హామర్స్ వినియోగం వంటి విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన..
అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ అధికారులతో డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సంభవిస్తే డ్రైవర్లు ఏ విధంగా వ్యవహరించాలి, అగ్నిమాపక పరికరాలను ఏ విధంగా వినియోగించాలనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మంటలు బస్సులో వేగంగా వ్యాపించినప్పుడు ఏ రకంగా వాటిని అదుపు చేయాలనే అంశాలను వివరిస్తున్నారు.
డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు
అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లు ప్రయాణికులకు సూచనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రయాణికుల భద్రతే పరమావధిగా, సురక్షిత ప్రయాణాన్ని కల్పించేలా అన్ని చర్యలు
చేపడుతున్నాం. – ఎస్.భవాని ప్రసాద్,
ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్
 
							సురక్షితంగా ప్రయాణించేలా..!
 
							సురక్షితంగా ప్రయాణించేలా..!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
