 
															సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్
కాగజ్‌నగర్‌రూరల్: ఆన్‌లైన్‌లో మోసం చేసిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో మోసపోయి రూ.45,790లను కోల్పోయినట్లు ఆగస్టు 15న ఓ బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా డబ్బులు ఏ అకౌంట్‌కు వెళ్లాయో డీఫోర్సీ బృందంతో సాంకేతిక ఆధారాలు సేకరించి ట్రేస్ చేయగా మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ దోహార్ అకౌంట్‌లో జమయ్యాయి. నిందితుడు అకౌంట్ పేరును ఆశిష్ కిరాణా స్టోర్ అని మార్పు చేసి వినియోగిస్తున్నాడు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, డీఫోర్సీ బృందం మధ్యప్రదేశ్‌కు వెళ్లి ఈనెల 25న నిందితుడిని పట్టుకుని అక్కడి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి ఈనెల 28న కాగజ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఆశిష్ టీస్టాల్‌లో పని చేస్తూ జీవిస్తున్న సమయంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన ఆకాశ్ వద్వానీతో పరిచయం ఏర్పడింది. ఏటీఎం, ఆధార్ కార్డు, మొబైల్ లింక్ అకౌంట్ ఇస్తే నెలకు రూ.10వేలు ఇస్తానని ఆకాశ్ వద్వానీ చెప్పడంతో ఆశిష్ ఇచ్చాడు. ఇతరులను మోసం చేసి వచ్చిన డబ్బులను ఆ అకౌంట్‌లో జమ చేసేవాడని ఆశిష్ పోలీసులకు తెలిపాడు. కాగా ఫిర్యాదు దారుడి అకౌంట్ నుంచి మోసపోయిన రూ.45,790లకు గాను రూ.34,537 లను ఫ్రీజ్ చేశామని సీఐ వివరించాడు. ఆకాశ్ వద్వానీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సైబర్ కేసును ఛేదించిన కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, పోలీసు సిబ్బంది, డీఫోర్సీ బృందాన్ని ఎస్పీ అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
