రేటింగ్స్‌లో వెనుకబడి! | - | Sakshi
Sakshi News home page

రేటింగ్స్‌లో వెనుకబడి!

Oct 30 2025 7:45 AM | Updated on Oct 30 2025 7:45 AM

రేటింగ్స్‌లో వెనుకబడి!

రేటింగ్స్‌లో వెనుకబడి!

● రిజిష్టర్‌ చేసుకున్న పాఠశాలలు 908 ● ఫైవ్‌స్టార్‌లో 23 స్కూళ్లు మాత్రమే..

మంచిర్యాలఅర్బన్‌: నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్‌ హరిత విద్యాలయాల రేటింగ్‌(ఎస్‌హెచ్‌వీఆర్‌) పేరిట కార్యక్రమం చేపట్టింది. మూత్రశాలల వినియోగం, నీటి వసతి, మొక్కలు నాటి సంరక్షణ తదితర అంశాలు పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్‌ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయా పాఠశాలల పరిస్థితిని ఎస్‌హెచ్‌వీఆర్‌ యాప్‌, https:// shvr. education. gov. in వెబ్‌సైట్‌లో యూడైస్‌ కోడ్‌తో లాగిన్‌ అయి నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,045 పాఠశాలల్లో 1,27,834 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 908 పాఠశాలలు ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకోగా.. ఇందులో 400 పాఠశాలలు రేటింగ్‌లో చోటు చేసుకున్నాయి. వీటిలో ఫైవ్‌స్టార్‌(అత్యుత్తమ) సాధించిన పాఠశాలలు 23 ఉన్నాయి. పచ్చదనం, నీటి పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో ఫోర్త్‌స్టార్‌(4స్టార్‌)లో 377 ఉన్నాయి. మిగతా 508 పాఠశాలలు రేటింగ్స్‌లో అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఆరు అంశాలు.. ఆరవై ప్రశ్నలు

స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణ నలోకి తీసుకుని 60 ప్రశ్నలు ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు విద్యార్థుల నడవడిక, ఎకోక్లబ్‌ల ఏర్పాటు, నీటి సంరక్షణ, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మొక్కలు, తోటల పెంపకం, సౌరశక్తి వినియోగం తదితర అంశాలకు ఆన్‌లైన్‌ ద్వారా సమాధానాలు ఇచ్చారు. అవసరమైన ఫొటోలు అప్‌లోడ్‌ చేశారు. మెరుగ్గా ఉండే వాటికి మార్కుల ఆధారంగా కేంద్రం ఎంపిక చేసింది.

క్షేత్రస్థాయి తనిఖీలు

ఎస్‌హెచ్‌వీఆర్‌ కార్యక్రమంలో భాగంగా అప్‌లోడ్‌ చేసిన వివరాలు, చిత్రాలను కమిటీ బృందం తనిఖీ చేస్తుంది. ఫైవ్‌స్టార్‌, 4స్టార్‌ పాఠశాలల్లో అప్‌లోడ్‌ చేసిన వివరాలు నిర్ధారించనున్నాయి. ఆయా స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, సహాయకుడితో బుధవారం నుంచి పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రాథమిక 3, ఉన్నత పాఠశాలలు 3, అర్బన్‌ నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఒక్కొక్కటి అత్యుత్తమమైన వాటిని తనిఖీల అనంతరం ఎంపిక చేస్తారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష స్కూల్‌గ్రాంట్‌గా ఇవ్వనున్నారు. పాఠశాలలను ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్‌ఫోజర్‌ విజిట్‌(క్షేత్ర సందర్శన)కు తీసుకెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement