 
															దివ్యాంగులకు ‘స్వయం’ భరోసా
పాతమంచిర్యాల: దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటు చేస్తోంది. దివ్యాంగ మహిళలకు భరోసా కల్పించి జీవితం సుఖమయంగా మార్చడానికి పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు పొందుతూ ఉండి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని చెవిటి, మూగ, అంధులు, శారీరక, మానసిక దివ్యాంగ మహిళల వివరాలు నెల రోజులుగా సేకరిస్తున్నారు. ఐదు నుంచి 15మంది సభ్యులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 253మంది వివిధ రకాల వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను గుర్తించారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచి నిర్వహణకు సంరక్షకులను నియమిస్తున్నారు. దివ్యాంగుల సంరక్షకులు బ్యాంకు రుణాలు తీసుకోవడం, చెల్లించడం, ప్రతీ నెల నిర్వహించే వీవో సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అంది సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం ఉంది.
చికిత్స, పునరావాస సేవలు
సంఘ సభ్యులకు వారి వైకల్య తీవ్రతను బట్టి ఫిజి యోథెరపి, ఆక్యుపేషన్ థెరపి, స్పీచ్‌థెరపి వంటి అవసరమైన సేవలు అందిస్తారు. పలు రకాల ఉపకరణాలు అందిస్తారు. సాంకేతిక పరికరాలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
ఆదాయ అభివృద్ధి
సంఘాల్లో వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సీడ్‌క్యాపిటల్, రివాల్వింగ్‌ఫండ్, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పిస్తారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా కంప్యూటర్ స్కిల్స్, టైలరింగ్, హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ కల్పించి ఆదాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం..
దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఆత్మస్థైర్యంతో జీవించేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లాలో సదరం సాఫ్ట్‌వేర్‌లో నమోదైన, ఆసరా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల వివరాలు సేకరించి ఎస్‌హెచ్‌జీలు ఏర్పాటు చేశాం. వారికి బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి రుణాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మంచిర్యాల
వీరు అర్హులు
దివ్యాంగులు 40శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యులు చేర్చుకుంటారు. కుటుంబంలో ఒకరి కన్న ఎక్కువ మంది వైకల్యం కలిగిన వారు ఉన్నా సంఘంలో చేరడానికి అర్హులే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
