 
															ఇందిరమ్మ బిల్లు కాజేసిన పోస్టుమాస్టర్
వేమనపల్లి: ఇందిరమ్మ లబ్ధిదారు ఖాతాలో జమ అయిన డబ్బులను ఓ పోస్టుమాస్టర్ స్వాహా చేసింది. విడతల వారీగా రూ.లక్ష డ్రా చేసుకుంది. చివరికి రూ.10వేలు వృద్ధురాలికి ఇవ్వగా.. అనుమానం వచ్చి ఖాతాను మరోచోట పరిశీలించగా స్వాహా పర్వం బయటపడింది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పదిరె అంకుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్‌మెంటు వరకు నిర్మించుకోగా గృహ నిర్మాణ శాఖ నుంచి సెప్టెంబర్ 29న రూ.లక్ష మొదటి విడత బిల్లు ఆమె పోస్టాఫీసు ఖాతాలో జమ అయ్యాయి. ఈ విషయమై ఆమెకు తెలియదు. ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బుల విషయమై వేమనపల్లి పోస్టాఫీసుకు వెళ్లింది. ఖాతాను పరిశీలించిన పోస్టుమాస్టర్ శాంక రూ.లక్ష ఉండడం గమనించింది. ఈ విషయం అంకుకు, ఆమె కుమారుడు చిన్నన్నకు చెప్పకుండా.. గ్యాస్ డబ్బులు పడలేదని తెలిపింది. అంకు వేలిముద్ర ద్వారా ఆ రోజు నుంచి డబ్బులు డ్రా చేస్తూ వచ్చింది. ఈ నెల 13, 15, 16వ తేదీల్లో పోస్టాఫీసుకు వస్తే ఖాతా పరిశీలిస్తానని చెప్పడంతో వెళ్లారు. ఆయా రోజుల్లో రూ.25వేల చొప్పున అంకు వేలిముద్ర ద్వారా రూ.75వేలు పోస్టుమాస్టర్ శాంక డ్రా చేసుకుంది. చివరి రోజు రూ.10వేలు అంకుకు ఇవ్వడంతో పోస్టుమాస్టర్‌పై అనుమానం వచ్చి మరోచోట ఆన్‌లైన్ సెంటర్‌లో వాకబు చేసింది. రూ.25వేల చొప్పున నాలుగు విడతలుగా డ్రా చేసుకున్నట్లు తెలియడంతో వృద్ధురాలు, కుటుంబ సభ్యులు ఆవాక్కయ్యారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమురం రమేష్, బౌడి గోపాల్, తాళ్ల వెంకటేష్‌గౌడ్ తదితకరులు లబ్ధిదారు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇఫ్తేకర్ అలీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆయన పోస్టుమాస్టర్‌ను ఆరా తీయగా.. అరగంటలో వస్తానని, తాను తప్పు చేశానని, డబ్బులు తిరిగి ఇస్తానని బతిమాలింది. పోస్టుమాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
