నెన్నెల: పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని, పత్తిని వీలైనంత త్వరగా సేకరించి సురక్షిత ప్రాంతానికి తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. బుధవారం ఆమె ఏవో సృజన, ఏఈవో రాంచందర్‌తో కలిసి నెన్నెల, బొప్పారం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే పత్తిని తీసి తడవకుండా టార్పాలిన్‌లతో కప్పి ఉంచాలని తెలిపారు. తడిసిన పత్తిని చెట్లపై నుంచి తీయకుండా ఆరిపోయాక సేకరించాలని తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12శాతం మించకుండా జాగ్రత్త పడాలని అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు పగిలిన పత్తిని తీయడంతో రంగు, నాణ్యత దెబ్బతినకుండా ఉంటుందని, మొదట 2, 3 తీతల్లో వచ్చే పత్తి అధిక నాణ్యత ఉంటుందని, దీనిని వేరుగా నిల్వ చేసుకుంటే మంచి ధర పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఉదయం పూట మంచు అధికంగా కురుస్తుందని మంచు తగ్గిన తర్వాతనే సేకరించాలన్నారు. అనంతరం కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి విక్రయంపై సందేహాలను వ్యవసాయ అధికారుల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
