 
															రక్తదానం మహోన్నత సేవ
జైపూర్: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని, రక్తదానం మహోన్నత సేవతో సమానమని రామగుండం సీపీ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని ఇందారంలో ఉన్న ఫంక్షన్‌హాల్‌లో జైపూర్ సబ్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం, ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. మంచిర్యాల రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ అత్యవసర సమయంలో అందించే రక్తంతో ప్రాణ దానం చేసినవారవుతారని తెలిపారు. విద్యార్థులకు పోలీసుల విధులు, రక్షణ, షీటీమ్స్, భరోసా సెంటర్లు, కమ్యూనికేషన్ సిస్టంపై అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గంజాయి, మత్తుపదార్థాలతో జరుగుతున్న అనర్థాలపై ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్ రచించిన అమర జవాన్ల త్యాగానికి నివాళి–ఆకాశమంత త్యాగం అనే పాటను విడుదల చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
