 
															బస్సులు ఆపాలని మహిళల రాస్తారోకో
కోటపల్లి: మండలంలోని రాంపూర్ గ్రామంలో బస్సులు ఆపాలని మహిళలు బుధవారం రాస్తారోకో చేశారు. ఆర్టీసీ బస్సులు ఆపకుండా డ్రైవర్లు, కండక్టర్లు తమపట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు గ్రామస్తులు, మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించారు. చెన్నూర్ నుంచి రాంపూర్ మీదుగా కాళేశ్వరం, సిరోంచకు వెళ్తున్న బస్సులు ఆపడం లేదని తెలిపారు. కాళేశ్వరం వెళ్లే ఆర్డీనరి బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి గ్రామంలో ఆపకుండా వెళ్తున్నాయని తెలిపారు. గ్రామస్తులు, విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదన్నారు. రాంపూర్ గ్రామంలో బస్సు దిగాలంటే మూడు కిలోమీటర్ల దూరంలోని కొల్లూర్, దేవులవాడ గ్రామంలో ఆపుతున్నారని, రాత్రివేళల్లో ప్రయాణించే మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. గతంలో పలుమార్లు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. మంచిర్యాల ఆర్టీసీ డీఎంతో ఫోన్‌లో మాట్లాడించగా.. మూడు రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీనిచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
