 
															పంటలు వర్షార్పణం
చెన్నూర్ గోదావరి పరీవాహక ప్రాంతంలో నెలకొరిగిన వరి పంట
చెన్నూర్: జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నాశనం అవుతుంటే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో కురిసిన వర్షాలతో వరద ముంచెత్తి గోదావరి పరీవాహక ప్రాంతంలో పత్తి పంటకు 50శాతం నష్టం వాటిల్లింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి కాయ రాలిపోతోంది. పొట్టకు వచ్చిన వరి పంట నేలకొరిగిపోవడంతో ధాన్యం దెబ్బతింటోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెన్నూర్ మండలం నారాయణపూర్, కిష్టంపేట, కొమ్మెర, ఆస్నాద తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. బయటకు వచ్చిన పత్తి తడిసి ముద్దవుతోంది. చెన్నూర్ మండలంలో 13,818 ఎకరాల్లో పత్తి, 18,270 ఎకరాల్లో వరి సాగైంది. గత ఏడాది కంటే ఈసారి ఆయా పంటల సాగు పెరిగింది. పత్తి క్వింటాల్‌కు రూ.8,100 ధర పలుకుతుండడంతో లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. వరి నేలకొరగడంతో ధాన్యం తాలుగా మారుతుందని, ఆశించిన ధర రాదని పేర్కొంటున్నారు.
వణికిస్తున్న మోంథా తుపాను
మొన్నటి వరకు భారీ వర్షాల భయం ఉండగా రెండ్రోజులుగా వాయుగుండ ప్రభావం మోంథా తుపానుగా మారింది. మూడు రోజులపా టు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. భారీ వర్షాలు కురిస్తే పంటలు వర్షార్పణం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
							పంటలు వర్షార్పణం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
