 
															నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థ
మంచిర్యాలక్రైం/నస్పూర్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల(పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని మంగళవారం స్థానిక సీసీసీ కార్నర్ నుంచి మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు మంచిర్యాల డివిజన్ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల కోసం పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఎందరో పోలీసులు విధి నిర్వహణలో మావోయిస్టులు, కరుడుగట్టిన నేరగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించినప్పుడే నేర రహిత సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్‌రావ్, నరేష్‌కుమార్, సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
