 
															కుక్కదాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో వీధి కుక్క వృద్ధురాలిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన పురప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వివరాలు.. కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దారవేణి లచ్చక్క (లక్ష్మి) అనే వృద్ధురాలు 20 ఏళ్లుగా నిత్యం బెల్లంపల్లికి వచ్చి పాలు విక్రయిస్తోంది. లచ్చక్క మంగళవారం హన్మాన్ బస్తీకి వెళ్లి ఇంటింటా తిరుగుతూ పాలు పోస్తోంది. ఈ క్రమంలో ఓ వీధి కుక్క ఒక్కసారిగా లచ్చక్క రెండు కాళ్లను కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఆమె అరుపులు విని వచ్చిన పలువురు కుక్కను వెళ్లగొట్టారు. లచ్చ వ్వ స్పృహ తప్పి పడిపోగా అంబులెన్స్‌లో బె ల్లంపల్లి ఏరియాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. లచ్చక్క కుటుంబీకులు వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, లచ్చక్కకు తీవ్ర రక్తస్రావం అవుతుండగా చికిత్స క్లిష్టంగా మారి నట్లు ఆమె కుమారుడు వెంకన్న తెలిపాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
