జిల్లాకు మహా ధాన్యం! | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు మహా ధాన్యం!

Oct 28 2025 8:16 AM | Updated on Oct 28 2025 8:16 AM

జిల్లాకు మహా ధాన్యం!

జిల్లాకు మహా ధాన్యం!

పొరుగు రాష్ట్రం నుంచి వడ్లు రవాణా స్థానిక రైతుల పేర్లతో సర్కారుకు విక్రయం గత సీజన్‌లో ధాన్యం రాకపై విచారణ ఈ వానాకాలం కొనుగోళ్లపై అప్రమత్తం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు విచారణ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత యాసంగి సీజన్‌లో చెన్నూరు నియోజకవర్గంలో పలు కొనుగోలు కేంద్రాలకు మహారాష్ట్ర నుంచి వచ్చిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర రైతుల పేర్లతో విక్రయించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆయా కేంద్రాల్లో జరిగిన కొనుగోళ్ల తీరుపై తనిఖీ చేసి వెళ్లారు. జిల్లా కార్యాలయం, జైపూర్‌ మండలం నర్సింగాపూర్‌, చెన్నూరు మండలం దుగ్నేపల్లితోపాటు పలు కేంద్రాల్లో గత యాసంగిలో పొరుగు రాష్ట్ర ధాన్యం ఇక్కడి రైతుల పేర్లతో అమ్ముకున్నట్లు రావడంతో అప్పటి రికార్డులు పరిశీలించారు. కేంద్ర నిర్వాహకులు, వ్యవసాయ అధికారులు, సహకరించిన రైతులు ఎవరెవరు, ఆ కేంద్ర పరిధిలో ఎంత మొత్తం లక్ష్యం ఉంది?, ఎంత మొత్తంలో అమ్మారు?, ఏయే మిల్లులకు ఆ ధాన్యం వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేశారు. దీనిపై నివేదిక ఉన్నతస్థాయిలోనే అందజేయనున్నట్లు తెలిసింది.

దిద్దుబాటు చర్యలు

మహారాష్ట్ర ధాన్యం రాకుండా జిల్లా యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేట్టింది. గత సీజన్లలో పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం వస్తోందనే చెక్‌పోస్టులు ప్రాణహిత బ్రిడ్జికి సమీపంలోనే ఏర్పాటు చేశారు. గతంలో జాతీయ రహదారిపైనున్న కోటపల్లి మండలం పారుపల్లి శివారులో ఉండేది. దీంతో పర్యవేక్షణ కొరవడింది. ఇక అక్కడ ఉన్న సిబ్బందిని మేనేజ్‌ చేస్తూ ధాన్యం రాష్ట్రం దాటిస్తూ అమ్మేస్తున్నారు. రాత్రివేళ లారీలకొద్దీ కోటపల్లి, చెన్నూరు, జైపూర్‌ మండలాల్లో కేంద్రాలకు తరలించి ఉదయం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. వీటికి కేంద్ర నిర్వాహకులతోపాటు వ్యవసాయ అధికారుల సహకారంతోనూ ఈ అక్రమ ధాన్యం కొనుగోలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వానాకాలంలో 301కేంద్రాలతో 2.32లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంది. ఈసారి పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అక్రమాలు చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిసింది.

పకడ్బందీగా నిఘా

మహారాష్ట్ర నుంచి ధాన్యం జిల్లాకు వస్తే చాలాసార్లు ఆ లారీలను తిప్పి పంపించాం. ఆ రాష్ట్ర ధాన్యం ఇక్కడ అమ్ముకోవడానికి వీలు లేదు. దీనిపై చెక్‌పోస్ట్‌ల్లో పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశాం. అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు ఉంటాయి. – సీహెచ్‌.బ్రహ్మారావు,

జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి

దొడ్డిదారిలో..

జిల్లాకు వందల క్వింటాళ్ల కొద్దీ మహారాష్ట్ర నుంచి ధాన్యం దొడ్డిదారిలో వస్తోంది. ప్రాణహిత నది ఆవల కొందరు సిరొంచ సమీప గ్రామాల నుంచి అధిక ధర ఆశతో జిల్లాకు చాటుగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వడ్ల వ్యాపారులు ఇక్కడి వారి సహకారంతో అక్కడ తక్కువ ధరతో కొనుగోలు చేసి తెలంగాణ పరిధిలో స్థానిక రైతుల పేర్లతో అమ్ముకుని లాభం పొందుతున్నారు. ఈ సీజన్‌లో పరిశీలిస్తే ఒక క్వింటాల్‌కు ఏ గ్రేడ్‌ రూ.2,389 సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర ఉంది. ఇక సన్న రకం వడ్లకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఉంది. మహారాష్ట్రలో ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లతో అక్కడి ధర తక్కువ. ఇక్కడ బోనస్‌ పొందే అవకాశం ఉంది. దీంతో చెక్‌పోస్టులను దాటేస్తే అమ్ముకోవచ్చని ఎత్తు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రంతో స్థానికుల బంధుత్వాలు, సత్సంబంధాలు, వ్యవసాయ భూములు ఉండడంతో అక్కడి వారికి జిల్లా వాసులు సహకారం అందిస్తున్నారు. దీంతో అధిక ధర పొందేందుకు సులువుగా మారుతోంది. ప్రభుత్వం రూ.వందల కోట్లు పెట్టి రాష్ట్ర రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్‌ ఇవ్వాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మిల్లులకు ధాన్యం తరలిస్తోంది. అయితే పొరుగు రాష్ట్ర రైతులు అక్రమ మార్గంలో అమ్ముకోవడంతో ప్రజాధనం దుర్వి నియోగం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement