నేరస్తులపై బహిష్కరణ వేటు
మంచిర్యాలక్రైం: కరుడుగట్టిన నేరస్తులు, గంజాయి, దొంగతనాలు, చైన్‌స్నాచర్లు, మహిళలను వేధించేవారు, భూ ఆక్రమణదారులు వంటి చట్టవ్యతిరేకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 37మంది నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌కు చెందిన ఓ యువకుడిపై 25 కేసులు ఉండడంతో రెండు నెలల క్రితం పీడీ యాక్టు నమోదైంది. మరికొందరిపై పీడీ యాక్టు, పద్ధతి మార్చుకోకపోతే నగర బహిష్కరణకు సైతం జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మందమర్రికి చెందిన ఓ రౌడీషీటర్‌పై నెల రోజుల క్రితం నగర బహిష్కరణ విధించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై, సెటిల్‌మెంటు, గ్యాంగుదాడులు, సంఘవిద్రోహ శక్తులు, పాత నేరస్తులపై ఎస్‌బీ, ఇంటెలిజెన్స్, ప్రత్యేక పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద హత్య, హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో డీసీపీ, గన్‌మెన్‌లపై కత్తులతో సెల్‌ఫోన్ దొంగల దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నేరచరితుల విషయంలో పోలీసులు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని పక్కనపెట్టి వారిని కట్టడి చేయడంలో నిమగ్నమయ్యారనే చర్చ జరుగుతోంది.
జిల్లాలో..
జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయ డం, గ్యాంగ్‌దాడులు, సెటిల్‌మెంట్లు, నేరస్తులు, గంజాయి, భూకబ్జాలకు పాల్పడే 250 మందిపై రౌడీషీట్ ఉంది. ఇందులో కొందరు పాత నేరస్తులు కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 30మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. వీరిలో ఒకరిపై నగర బహిష్కరణ విధించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించడం, పద్ధతి మార్చుకోవాలని లేదంటే నగర బహిష్కరణ తప్పదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
అక్రమార్కుల గుండెల్లో దడ
నగర బహిష్కరణ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కేసుల నమోదుతో అక్రమార్కుల్లో పోలీసులు దడ పుట్టిస్తున్నా రు. జిల్లాలోని కొందరు రౌడీషీటర్లు ఇప్పటి కే మంచిర్యాలను వదిలి హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లి ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తూ ప్రత్యేక నిఘాను పటిష్టం చేశారు.


