లక్కు దక్కింది.. ఇక కిక్కే..!
లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు జిల్లాలోని 73 దుకాణాలకు 1,712 దరఖాస్తులు 16 మంది మహిళలను వరించిన అదృష్టం
పారదర్శకంగా కేటాయింపులు
నస్పూర్: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. లక్కీడ్రాలో దుకాణాలు దక్కిన వారు ఎగిరి గంతేయగా.. దుకాణాలు దక్కని వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లాలోని 73 దుకాణాలకు 1,712 దరఖాస్తులు రాగా.. నస్పూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్‌లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. ఎకై ్సజ్, పోలీసు అధికారులు భద్రత చర్యలు చేపట్టారు. ఉదయం 9గంటల నుంచి దరఖాస్తుదారులను మాత్రమే లోపలికి అనుమతించారు. మొబైల్‌ఫోన్లను కూడా అనుమతించలేదు. ఉదయం 11గంటలకు కలెక్టర్ కుమార్ దీపక్ డ్రా పద్ధతిలో దుకాణాలు కేటాయింపు చేపట్టారు. డ్రాలో మొదటి షాపును మహిళ దక్కించుకున్నారు. జిల్లాలోని ఇందారం ఒకటో నంబరు దుకాణానికి ఓపెన్ కేటగిరీలో అత్యధికంగా 64 దరఖాస్తులు రాగా.. మహిళను అదృష్టం వరించింది. రెండోస్థానంలో భీమారం దుకాణం నంబరు 25కు జనరల్ కేటగిరీలో 59 దరఖాస్తులు రాగా.. ఆ షాపు సైతం మహిళనే వరించింది. ఎస్సీలకు 10, ఎస్టీ 6, గౌడ్‌లకు 6 దుకాణాలు కేటాయించగా.. ఆయా కేటగిరీల వారు దక్కించుకున్నారు. మొత్తంగా 16మంది మహిళలకు దుకాణాలు దక్కాయి. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న షాపుల టెండర్ నవంబర్ 30తో ముగుస్తున్న సంగతి తెలిసిందే.
సంతోషంగా ఉంది..
మాది హాజీపూర్. నేను మొదటిసారిగా మద్యం షాపు టెండర్లలో పాల్గొన్నాను. నేను టెండర్ వేసిన మొదటిసారే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. గెజిట్ నంబర్–1 షాప్ దక్కింది. – గజెంగి లక్ష్మి
నూతన మద్యం పాలసీ విధానం 2025–27 ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తూ డ్రా తీసినట్లు వివరించారు. దుకాణాలు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు 24గంటల్లోపు చెల్లించాలని సూచించారు. ఫీజు చెల్లించిన తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్తగా షాపులు నిర్వహించవచ్చని తెలిపారు. ఎకై ్సజ్, ప్రోహిబిషన్ జిల్లా అధికారి నందగోపాల్, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు.
లక్కు దక్కింది.. ఇక కిక్కే..!


