పోలీసు విధులపై విద్యార్థులకు అవగాహన
మంచిర్యాలక్రైం: పోలీసుల విధులు, బాధ్యతలపై వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు చట్టాలు, విధులు, షీ టీమ్స్, భరోసా సెంటర్లు, కమ్యూనికేషన్ సిస్టం, ఫింగర్ ప్రింట్ డివైస్ ఉపయోగాలు, స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ నిబంధనలు తదితర వాటిపై వివరించారు. అనంతరం సీపీ అంబర్‌కిషోర్ ఝా మాట్లాడుతూ పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికే కాదు.. సమాజంలో శాంతిభద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్‌ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


