అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బేల మండలం బోదిడి గ్రామానికి చెందిన కుమరం దేవరావు తనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన వెంకటమ్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాల మండలం రెబ్బన గ్రామానికి చెందిన శిరీష ఎంబీబీఎస్ చదువు కోసం ఫీజు మంజూరు చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.


