హామీలు సరే.. అమలేది..! | - | Sakshi
Sakshi News home page

హామీలు సరే.. అమలేది..!

Oct 28 2025 8:16 AM | Updated on Oct 28 2025 8:16 AM

హామీలు సరే.. అమలేది..!

హామీలు సరే.. అమలేది..!

● గనులు మూతపడి కళ తప్పిన బెల్లంపల్లి ● ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగుల విలవిల

బెల్లంపల్లి: రెండున్నర దశాబ్దాల క్రితం వరకు భూగర్భ బొగ్గుగనులు, విభాగాలు వేలాదిమంది కార్మికులతో విరాజిల్లిన బెల్లంపల్లి ప్రస్తుతం కళ తప్పింది. ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు, మానవ వనరులు అపారంగా ఉన్నా అభివృద్ధి కరువైంది. ఎన్నికల సమయంలో నాయకులు, పాలకులు ఇచ్చే హామీలు అమలుకు నోచుకోక నిరుద్యోగం పెరిగిపోతోంది.

పాలిటెక్నిక్‌ కళాశాల అప్‌గ్రేడ్‌ ఎప్పుడో..!

బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను అప్‌గ్రేడ్‌ చేస్తామని గత రెండున్నర దశాబ్దాల కాలంగా పాలకులు, నాయకులు హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇంజినీరింగ్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయించి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో, ప్ర స్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో పాలిటెక్నిక్‌ కళాశాల అప్‌గ్రేడ్‌ అంశం ఎన్నికల నినాదంగా మారింది. ఈ విషయంలో అడుగు ముందుకు పడక విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వ్యవసాయ కళాశాల

బెల్లంపల్లి కేంద్రంగా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఏర్పాటై పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. కేవీకేకు అనుబంధంగా అగ్రికల్చర్‌ లేదా హార్టికల్చర్‌ కళాశాల మంజూరుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా పాలకులు యోచించడం లేదు. అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ కళాశాల మంజూరైతే విద్యార్థులు, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రెండున్నర దశాబ్దాల క్రితం బెల్లంపల్లికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మంజూరు కాగా అప్పటి పాలకుల పట్టింపులేని తనంతో జగిత్యాలకు తరలిపోయింది.

బొగ్గు ఆధారిత పరిశ్రమలేవీ..?

రెండో బొగ్గుట్టగా ప్రసిద్ధి గాంచిన బెల్లంపల్లిలో బొ గ్గు ఆధారిత పరిశ్రమల ఊసు లేకుండా ఉంది. బొ గ్గు గనులతో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో రకరకాల కారణాలతో గనులన్నీ మూ త పడగా, వేలాది మంది కార్మికులు ఇతర ఏరియాలకు వెళ్లారు. గనులు మూతపడి, కార్మికులు బదిలీ కావడంతో బెల్లంపల్లి వైభవం మసకబారింది. ఈ క్రమంలో అర్ధంతరంగా మూతపడ్డ భూగర్భ గనుల్లో ఇంకా ఏళ్ల తరబడి తవ్వకాలు జరిపినా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నా వెలికితీతలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. ఈ కారణంగా బొగ్గు ఆధారిత పరి శ్రమలు ఏర్పాటు కాక నిరుద్యోగులు, కార్మికుల పి ల్లలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి.

బెల్లంపల్లి పట్టణం

నర్సింగ్‌ కళాశాల లేనట్లే..!

ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌ ఆధ్వర్యంలో 275 పడకల సామర్థ్యం కలిగిన ఏరి యా ఆసుపత్రి, ప్రభుత్వ పరంగా వంద పడకలతో కూడిన ఏరియా ఆసుపత్రులు బెల్లంపల్లిలో ఉన్నాయి. ఏటా వందలాది మంది ఈ ప్రాంత విద్యార్థినులు నర్సింగ్‌ విద్య అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ అవకాశం అందుబాటులో లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు అందుబాటులో ఉండడంతో బాలికలు పోటీ పడి చేరుతున్నారు. అదే తీరుగా నర్సింగ్‌ కళాశాల మంజూరు చేయించాలనే డిమాండ్‌ ఉన్నా పట్టింపు చేయడం లేదు.

జాడలేని మెడికల్‌ కళాశాల.. ఆర్టీసీ బస్‌డిపో..

బెల్లంపల్లికి పూర్వ వైభవం తీసుకు రావడానికి మెడికల్‌ కళాశాల, ఆర్టీసీ బస్‌ డిపో మంజూరు చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని హామీలిచ్చిన పాలకుల నోటి వెంట ప్రస్తుతం ఆ మాట రావడం లేదు. మెడికల్‌ కళాశాల మంజూరు అవుతుందో లేదో తెలియదు కానీ కనీసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తగినంతమంది వైద్యులు, సిబ్బందిని నియమించడంలోనూ విఫలం అవుతున్నారు. ఆర్టీసీ బస్‌డిపో మంజూరు చేయిస్తానని చేసిన వాగ్దానం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదనే అసంతృప్తి ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement