 
															పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలు
నెన్నెల: మండల కేంద్రంలో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ కుక్క దాడి చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెన్నెల గ్రామంలో చాకలివాడకు చెందిన ఓరగంటి బాపు, లేతకారి కుమార్‌లతో పాటు బెస్తవాడకు చెందిన కంప ల రాజేశం, కంపల జశ్వంత్, కుమ్మరివాడలో భీమరాజుల హరీశ్, అట్కపురం పోశంలపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గాయపడిన వారికి నెన్నెల పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించి బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామస్తులు వెంబడించి పిచ్చికుక్కను కర్రలతో కొట్టి హతమార్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న పిచ్చికుక్కల నుంచి కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
