 
															కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
డబ్బులు తిరిగివ్వడం లేదని మాజీ ఎంపీపీ కిడ్నాప్ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ రవికుమార్
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండల మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శనివారం సాయంత్రం బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ అడెల్లి రవికుమార్ వివరాలు వెల్ల డించారు. ఈ నెల 23న మాజీ ఎంపీపీ గో మాస శ్రీనివాస్ వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రా మం బట్వాన్‌పల్లి నుంచి బెల్లంపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య అమృత తాళ్లగురిజాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు జరిపి చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు.
డబ్బులు ఇవ్వడం లేదని..
గత ఆగస్టులో గోమాస శ్రీనివాస్, అల్లం శ్రీను, ఇప్ప భూమయ్యలు తాండూర్ మండలం అచ్చలాపూర్ శివారులో 42 ఎకరాలు భూమి తమ పేరు మీద ఉందని అమ్ముతామని పులిమడుగుకు చెందిన బండి సాగర్, మల్లేశ్‌లతో రూ.80 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. గోమాస శ్రీనివాస్‌కు సాగర్ రూ.80 లక్షలు ఇచ్చాడు. భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని సాగర్, మల్లేశ్‌లు కోరగా శ్రీనివాస్ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సాగర్ నకిలీ భూమి పత్రాలతో తమను శ్రీనివాస్ మోసం చేసినట్లు గ్రహించి రామకృష్ణపూర్ పోలీసుస్టేషన్‌లో సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు శ్రీనివాస్ రెండు నెలల గడువు కోరాడు. ఆ మేరకు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు. అయితే గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా శ్రీనివాస్ తప్పించుకు తిరుగుతుండడంతో సాగర్ కక్ష పెంచుకున్నాడు. శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేస్తేనే తమ డబ్బులు తమకు వస్తాయని భావించాడు. బెల్లంపల్లి పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన గొల్ల సంపత్ సాయంతో బెల్లంపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన మైలారపు భీమేశ్, బెల్లంపల్లికి చెందిన సాదిక్, సాయితేజలతో రూ.2.40 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నారు. డబ్బును సాధిక్‌కు అప్పగించారు. పథకం ప్రకారం ఈ నెల 23న పోచమ్మగడ్డ సమీపంలోని రోజ్ గార్డెన్ ప్రాంతంలో సాధిక్, డ్రైవర్ సాయితేజ, భీమేశ్‌లు గోమాస శ్రీనివాస్‌ను అడ్డుకుని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారు. మార్గమధ్యలో బండి మల్లేశ్, సాగర్‌లు కారులో ఎక్కగా చంద్రవెల్లి మీదుగా టేకులపల్లి, దహెగాం, ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వరకు తీసుకెళ్లారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేవరకు విడిచిపెట్టమని శ్రీనివాస్‌ను బెదిరించారు. కాగా తాళ్లగురిజాల పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కారును ట్రేస్ చేసి శుక్రవారం రాత్రి జన్నారం చెక్‌పోస్టు వద్ద నిందితులను, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బండి మల్లేశ్, బండి సాగర్, మైలారపు భీమేశ్, సాధిక్, సాయితేజలను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. గొల్ల సంపత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, కిడ్నాప్‌కు ఉపయోగించిన ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. బెల్లంపల్లి రూరల్ సీఐ చందవోలు హనోక్, తాళ్లగురిజాల, నెన్నెల ఎస్సైలు బండి రామకృష్ణ, ప్రసాద్, ఏఎస్సైలు అలీ, బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
