 
															ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం
దహెగాం: నిండు గర్భిణి శ్రావణిని ఆమె మామ శివార్ల సత్తయ్య గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసి వారం గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలోని శ్రావణి కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ శ్రావణి హత్యకు గురైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీలు నేటికీ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు. గిరిజనులను చిన్నచూ పు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటివరకు 140 కుల దురహంకార హత్యలు జరి గాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఐదెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండ రవికుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాజన్న, నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్, జిల్లా అధ్యక్షుడు కొరంగుల మాలశ్రీ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
