 
															భార్యపై కత్తెరతో దాడి
జన్నారం: కట్టుకున్న భర్తనే భార్యపై కత్తెరతో దాడి చేసిన ఘటన శనివారం జన్నారం మండలం చింతగూడలో చోటుచేసుకుంది. బాధితురాలి సమీప బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం చింతగూడకు చెందిన అనితకు, వె ల్గటూరు మండలం స్తంభంపల్లికి చెందిన సూర అశోక్‌తో 2020లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. గత సంవత్సరం భార్యభర్తల మధ్య గొడవ జరగ్గా పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. తర్వాత అశోక్ జీవనోపాధికి దుబాయ్ వెళ్లాడు. సంవత్సర కాలంగా అనిత చింతగూడలోని తన అన్నయ్య కోట ఉపేందర్ ఇంటిలో ఉంటుంది. అశోక్ దుబాయ్ నుంచి గురువారం తిరిగివచ్చాడు. శుక్రవారం చింతగూడకు వచ్చి భార్యతో మాట్లాడి తిరిగి స్తంభంపల్లికి వెళ్లాడు. శనివారం తిరిగి చింతగూడకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. పక్కింటికి వెళ్లిన భార్య అనిత ఇంటికి చేరుకుని లోపలికి వెళ్తుండగా ఇంట్లో ఉన్న బీడీలు చేసే కత్తెరతో అశోక్ ఆమైపె దాడి చేశాడు. మెడ, గొంతు, పొట్ట వద్ద పొడిచి గాయపరిచాడు. ఆమె అరుస్తూ రోడ్డుపై పరుగెత్తడంతో అశోక్ పారిపోయాడు. గమనించిన బంధువులు ఆమెను అంబులెన్స్‌లో లక్షెట్టిపేట ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్సై అనూషను సంప్రదించగా దాడి జరిగిన మాట వాస్తవమేనని, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
