 
															మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: అటవీశాఖ ప్లాంటేషన్‌లోకి ఎద్దు చొరబడడంతో కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ ఆఫీసర్ బెదిరింపులకు మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన ఘటన ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొట్టిపటార్ గ్రామానికి చెందిన వాగ్మారే భుజంగరావుకు ఐదుగురు కుమారులున్నారు. మూడో కుమారుడు వాగ్మారే గౌతం (29) ఎప్పటి లాగే తమ ఎద్దులను మేపేందుకు శుక్రవారం చేనుకు వెళ్లాడు. చేను పక్కన ఉన్న ఫారెస్ట్ ప్లాంటేషన్‌లోకి ఎద్దు వెళ్లడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన గౌతం చేనులో ఉన్న పురుగుల మందు తాగి కింద పడిపోయాడు. మృతుడి చిన్న తమ్ముడు నైలేశ్ అటువైపు వెళ్లగా కిందపడి ఉన్న గౌతం విషయాన్ని అతడికి చెప్పాడు. వెంటనే గౌతంను ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుని తండ్రి వాగ్మారే భుజంగరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
