 
															క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న సంసద్ ఖేల్ అభియాన్ క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. గురువా రం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో క్రీడా పో టీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ యాప్‌ను ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులను క్రీడల పట్ల ఆకర్షితులను చేయాలనే ఉద్దేశంతో ఈ క్రీడా మహోత్సవాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ క్రీడాకారులు పాల్గొనేందుకు అర్హులన్నారు. నవంబర్ చివరి వారంలో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, హాకీ, యోగా, రెజ్లింగ్, స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, గిల్లిదండ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఈనెల 24నుంచి నవంబర్ 10 వరకు https://sansadkhelmahotsav.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారధి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామేశ్వర్, పెటా కార్యదర్శి సాయికుమార్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
