 
															ప్రాణం తీసిన అక్రమ విద్యుత్ రక్షణ తీగ
ఖానాపూర్: వన్యప్రాణుల నుంచి పంట రక్షణ కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఓ గిరిజన యువకుడి ప్రాణాన్ని బలికొంది. సీఐ సీహెచ్ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్‌కొండ పంచాయతీ పరిధి దేవరిగూడ గ్రామానికి చెందిన సిడాం గజానంద్(45), బీర్నంది పంచాయతీ పరిధిలో గల తుమ్మగూడెంలోని అతని చిన్నమామ అర్క జ్యోతిరాం ఇంటికి మూడు నెలల క్రితం కూలీ పనుల కోసం వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం గజానంద్ భార్య యమున తన ముగ్గురు పిల్లలతో పాటు కడెం మండలం గంగాపూర్ గ్రామంలో జరిగే దండారీ ఉత్సవాలకు వెళ్లింది. మంగళవారం రాత్రి గజానంద్ ఇంటివద్ద లేకపోవడంతో చుట్టుపక్కల వెతికినా జాడ కానరాలేదు. బుధవారం ఉదయం ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామశివారులోని వ్యవసాయ భూమి వద్ద గజానంద్ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పంట పొలాన్ని అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు అక్రమంగా విద్యుత్ రక్షణ కంచె ఏర్పాటు చేయగా అటు వైపు కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన గజానంద్ మంగళవారం విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య యమున, ఇద్దరు కూతుళ్లు శైలజ, వెన్నెల, కొడుకు బదిరాజ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
