 
															ఏసీబీ అధికారుల తనిఖీలు
నిర్మల్‌టౌన్: సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామ సమీపంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏసీబీ డీఎస్పీ మధు నేతృత్వంలో అధికారులు కార్యాలయానికి చేరుకొని, కంప్యూటర్‌లో నమోదైన వివరాలు, సిబ్బంది మొబైల్ ఫోన్లను, రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ.. సాధారణ తనిఖీల్లో భాగంగానే డీటీవో కార్యాలయంలో తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి, ఎంవీఐలు సెలవుల్లో ఉన్నారని, రికార్డులు పరిశీలించగా అన్ని సక్రమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యాలయానికి వచ్చే వారు ఏజెంట్ ద్వారా లైసెన్సులు, ఇతర పనులు చేసుకుంటున్నట్లు తెలిసిందని దీనిపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని సూచించారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఏసీబీ నంబర్ 1064ను సంప్రదించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇదిలా ఉండగా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయని తెలియడంతో నిర్మల్‌లో చర్చ మొదలైంది. ఎవరూ ఏ అధికారిని పట్టించారో.. అని కొంతసేపు అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా అధికారుల దాడులు రాత్రి వరకు కొనసాగాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
