
కార్మిక సమస్యలపై దశల వారీ పోరాటం
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటం చేయనున్నట్లు బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ కాలనీలోని యూనియన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో జూలై 24 నుంచి 31 వరకు గనులపై గేట్ మీటింగ్‌లు పెట్టి కార్మికులను చైతన్య పరుస్తామని, రెండో విడతలో ఆగస్టు 5 నుంచి 14 వరకు జన సంపర్క అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేత, మూడో విడతలో ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 5 వరకు డిపార్టుమెంట్లు, కార్మిక వాడల్లో సమావేశాలు నిర్వహిస్తామని, నాలుగో విడతలో సెప్టెంబర్ 15న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బీఎంఎస్ శ్రీరాంపూర్ బ్రాంచి ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, నాయకులు రాగం రాజేందర్, మిట్టపల్లి మొగిలి, కుమ్మరి చంద్రశేఖర్, బుర్ర అరుణ్‌గౌడ్, చల్ల ప్రశాంత్, శేఖర్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.