
గ్రీన్‌ఫీల్డ్.. చకచకా..
● వేగంగా వరంగల్–విజయవాడ హైవే పనులు ● నాలుగు రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మెరుగు ● మారనున్న జైపూర్ రూపురేఖలు
జైపూర్:మంచిర్యాల–వరంగల్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పనుల్లో వేగం పుంజుకుంది. నాలుగు వరుసల రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. ఒకవైపు 63వ నంబర్ జాతీయ రహదారి, మరోవైపు హైదరాబాద్ రాజీవ్ రహదారి రెండు ప్రధాన రహదారులను కలుపుకుని కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం చేపట్టడంతో జైపూర్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మంచిర్యాల జిల్లా రసూల్‌పల్లి కేంద్రంగా రింగ్ రోడ్డుతో కొత్త హైవే రోడ్డు ప్రారంభం కానుండగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. భారత దేశానికి సెంటర్ పాయింట్‌గా ఉన్న నాగ్‌పూర్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరుకుల ట్రాన్స్‌పోర్టు సౌలభ్యం సులభతరం కావడంతో పాటు దూర, సమయ భావం కలిసిరానుంది.
రూ.3,440 కోట్లతో 110 కిలోమీటర్లు
మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నాలుగు వరుసల ఎన్‌హెచ్–163జీ రోడ్డు నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. జైపూర్ మండలం రసూల్‌పల్లి కేంద్రంగా ప్రారంభమైన కొత్త హైవే రోడ్డు ఎల్కంటి, టేకుమట్ల, నర్సింగాపూర్, బెజ్జాల, షెట్‌పల్లి, కుందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్ మీదుగా గోదావరినదిపై నుంచి పెద్దపల్లి జిల్లా మంథని, భూపాలపల్లి జిల్లా మేదరిమెట్ట నుంచి వరంగల్ జిల్లా ఉరుగొండ, నెక్కొండ, జనగామ జిల్లా ఆలేరు, పెరుమాండ్ల నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్లనుంది. రూ.3,440 కోట్లతో మొత్తం 110 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మిస్తున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 22 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో 50కి పైగా చిన్న బ్రిడ్జీలు, 7 పెద్ద బ్రిడ్జీలను నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు దక్కించుకున్న మెఘా ఇంజినీరింగ్ కంపెనీ ఇప్పటికే జిల్లాలోని పార్వతి బ్యారేజి (కిష్టాపూర్) వద్ద భారీ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ ప్రస్తుతం వానలు లేకపోవడంతో రోడ్డు గ్రౌండ్ వర్క్ చకచకా జరుగుతోంది. నాలుగు వరుసలతో 12 నుంచి 14 ఫీట్ల ఎత్తులో ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మిస్తున్నారు. నర్సింగాపూర్, వేలాల వద్ద ఇంటర్ ఛేంజ్ (రోడ్డు ఎక్కడం, దిగడం)కోసం నిర్మాణాలు సాగుతున్నాయి.
హైవేతో కొత్త కళ...
ఇప్పటికే జైపూర్ పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడే సింగరేణి సంస్థ 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటును నెలకొల్పగా దానిని విస్తరిస్తూ మరో 800 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. జైపూర్ మండలానికి ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు రాజీవ్ రహదారి ఉండగా కొత్తగా నిర్మించనున్న వరంగల్–విజయవాడ హైవేతో కొత్త కళ సంతరించుకోనుంది. భవిష్యత్‌లో ఈ ప్రాంతం పట్టణంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉండడంతో ఇక్కడి భూములు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఒక ఎకరాకు రూ.కోటికి పైగానే ధర పలుకుతోంది.