
కొత్త బొగ్గు గనులు రావాలి
● లేదంటే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం ● కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్: సింగరేణి కొత్త గనులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయపడ్డారు. రామకృష్ణాపూర్‌లోని ఆర్‌కే1 సుభాష్‌నగర్ కాలనీని ఆదివారం సందర్శించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై సీపీఐ నాయకులు మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వివేక్ మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటు విషయమై తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడానని తెలిపారు. కేబినేట్ సమావేశంలోనూ కొత్త గనుల ఏర్పాటుపై చర్చించామన్నారు. మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికల జరిపించాలని ఇప్పటికే న్యాయస్థానంలో అఫిడవిట్ వేసినట్లు చెప్పారు. కోర్టు తీర్పు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సుభాష్‌నగర్‌లో ఓపెన్‌జిమ్, డ్రైనేజీలు, రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి...
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయాన్ని మంత్రి వివేక్ ఆదివారం సందర్శించారు. ఈ నెల 20న బోనాల జాతర నిర్వహించనుండగా స్థానికులతో కలిసి జాతర పోస్టర్ ఆవిష్కరించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మైసమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని పలువురు మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం నాయక్‌పోడ్ సంఘం నాయకులతో కలిసి మంత్రి గాంధారి ఖిల్లాను సందర్శించారు. కాలభైరవుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాయలింగు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, రఘునాథ్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, సీపీఐ నాయకులు రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.