
‘ప్రాణహిత’ ఉగ్రరూపం
వేమనపల్లి/కోటపల్లి: ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, ఉప నదుల నుంచి వరద కారణంగా జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కుమురంభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడంతోనూ నదిలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. వేమనపల్లి పుష్కరఘాట్ రోడ్డు పూర్తిగా మునిగిపోగా ఎంచపాయె, చింతొర్రెతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సుంపుటం, జాజులపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు మునిగిపోయాయి. అవతలి వైపు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వేమనపల్లి పుష్కరఘాట్, వెంచపల్లి రేవుల వద్ద మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులకు రాకపోకలు సాగించే నాటు పడవలను తహసీల్దార్ సంధ్యారాణి, ఎస్సై శ్యాంపటేల్ నిలిపివేయించి హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల్లో పత్తి పంటలు జలసమాధి అయ్యాయి. కోటపల్లి మండలం వెంచపల్లి, సుపాక, జనగామ, ఆలుగామ, సిర్సా, అన్నారం, రాపల్లి, అర్జునగుట్ట గ్రామాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆయా గ్రామాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగి రైతులకు నష్టం వాటిల్లింది. వేల పెట్టుబడితో విత్తిన పత్తి మొక్కల దశలోనే వరద పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
చెన్నూర్: చెన్నూర్‌లో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం నదిలో వరద పెరిగింది. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిస్తే పరీవాహక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. పరీవాహక ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వందలాది ఎకరాల్లో పంట నష్టం
సరిహద్దు రాకపోకల నిలిపివేత