
ఊరికో పోలీస్
● మళ్లీ వీపీవోల నియామకం ● స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమలు ● పోలీసింగ్‌లో పారదర్శకత ● తాజాగా డీజీపీ జితేందర్ సమీక్ష
మంచిర్యాలక్రైం: నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం కంటే నేరమే జరగకుండా నిరోధించడం మేలనే భావనతో ప్రతీ గ్రామంలో గ్రామ పోలీస్ అధికారి(వీపీఓ)ని నియమించాలని ఇటీవల పోలీసు శాఖ నిర్ణయించింది. గతంలో రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో వీపీవో, జనమైత్రి పేరుతో ఈ వ్యవస్థ కొంతకాలం కొనసాగినా.. ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ మరోసారి గ్రామ పోలీసు వ్యవస్థ బలోపేతానికి అమలు చేయాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో పోలీసు కమిషనర్, ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వీపీఓల నియామకానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
గతంలో జనమైత్రి కార్యక్రమాలు
గ్రామ స్థాయిలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటే అక్కడి సామాజిక పరిస్థితులు, సమస్యలు, చిన్న చిన్న తగాదాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పోలీసు అధికారులను నియమించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రామగుండం పోలీసు కమిషనరేట్ ఏర్పడింది. తొలి కమిషనర్‌గా పని చేసిన విక్రమ్‌జిత్ దుగ్గల్ జనమైత్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీపీఓ, జనమైన పోలీసు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు గ్రామాలు, వాడల్లో గోడలపై రాసి ఉంచారు. పోలీసులు రోజువారీగా ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అప్పట్లో మంచి ఫలితాలే రాబట్టినా కొంతకాలానికి కార్యక్రమాలకు బ్రేక్ పడింది.
ప్రజల వద్దకే పోలీసులు
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18మండలాలు, 311 గ్రామ పంచాయతీలు, 382 గ్రామాలు, ఆరు మున్సిపాల్టీలు ఉన్నాయి. గతంలో జనమైత్రిలో భాగంగా రెండు మూడు గ్రామాలకు ఒకరిని నియమించడంతో సిబ్బంది కొతర వల్ల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే సాగింది. పోలీసు వ్యవస్థ బలోపేతానికి రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించడంతో గ్రామ పోలీసు అధికారుల నియామకంపై దృష్టి సారించారు. గ్రామంతోపాటు మున్సిపాల్టీల్లో వార్డులు, డివిజన్ వారీగా వీపీవోలను నియమిస్తారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు కూడా వారి పర్యవేక్షణలోనే ఉండనున్నాయి. రెండ్రోజులకోసారి గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని తీవ్రతను బట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. గ్రామస్తులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని నిరంతరం వారితో సంబంధాలు కొనసాగిస్తారు.
నేరాలు అరికట్టేందుకే..
నేరాలు జరిగిన తర్వాత అరెస్టులు, విచారణ, కోర్టులు అంటూ తిరగడం కంటే నేరాలే జరుగకుండా ఆరంభంలోనే అరికట్టేందుకే గ్రామ పోలీసు అధికారుల వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. గతంలో సిబ్బంది కొరత వల్ల కొంత అంతరాయం కలిగింది. ఇప్పుడు సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఇకపై పకడ్బందీగా అమలవుతుంది. ప్రతీ గ్రామంలోని విషయాలు త్వరగా తెలుసుకునే వీలుంటుంది.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల
జనమైత్రి కార్యక్రమం(ఫైల్)

ఊరికో పోలీస్